Thursday, July 24, 2008

డబ్బు !!!

డబ్బు ... డబ్బు ... డబ్బు ...

వినడానికి చాలా చిన్న పదం ... కాని చాలా శక్తివంతమైంది. ప్రపంచాన్ని నడిపించే సత్తా ఉన్నది, మనుషులను మృగాలుగా మార్చే మాయావి అది. చూడటానికి చాలా తేలికైనది, కాని, మనవ సంభందాల పునాదులను సైతం కదిలించ గలిగే మహోన్నతమైన శక్తి అది.

నిజానికి డబ్బును సృష్టించింది మనిషి. కాని ఈనాడు ఆ డబ్బే మనిషిని కీలు బొమ్మను చేసి ఆడిస్తోంది. నేటి సమాజంలో డబ్బు ఒక ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు తిరిగినట్టు నేటి ఈ సమాజం డబ్బుచుట్టూ తిరుగుతోంది.

ఒక ఆర్థికవేత్త చెప్పినట్టు .. 'అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే' .. అన్నది నూటికి నూరు పాళ్ళు నిజం అనిపిస్తుంది. వ్యాపారమైనా, వివాహమైనా, చదువైనా, వ్యవసాయం అయినా .. ఏదైనా .. ఇంకేదైనా ... డబ్బు లేకుండా, డబ్బు ప్రసక్తి లేకుండా వాటి ప్రస్తావన ఉండదు, పని జరగదు.

ఈ డబ్బు ఎక్కడ, ఏ రకంగా, ఎందుకు, ఎలా ప్రభావితం చూపుతున్నాయో తెలుసుకోవడం కన్నా, అసలెందుకు మనిషిఈ డబ్బుకు ఇంతటి ప్రాధాన్యతను ఇచ్చాడు అన్నది ఆలోచించాల్సిన విషయం. వీటన్నిటికి మూల కారణం మనిషిలోని స్వార్థం, ఆశ, అధికార దాహం, కోరికలు. ప్రతి ఒక్కరిలో స్వతహాగా ఈ గుణాలు ఉండక పోవచ్చు, కాని అలాంటి గుణాలు ఉన్నవాళ్ళ వల్ల, ఇతరులు తప్పని సరి పరిస్థితుల్లో వారిలా మారక తప్పడం లేదు.

డబ్బే ప్రధానం అనే సిద్దాంతానికి అతీతంగా ఉండే వారు ఉన్నారు. బహుశా, అలంటి వాళ్ళకే డబ్బు సమాజం పైన ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపుతుందో అర్థం అవుతుందేమో? డబ్బు అవసరమే, కాని అది ఒక మందులా మాత్రమే వాడుకోవాలి. జబ్బు చేసినప్పుడు మందు వాడినట్టు, అవసరమైనప్పుడే దానిని ఉపయోగించాలి, అప్పుడే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈమాత్రం ఆలోచన అందరికి ఉంటే ప్రపంచం లో ఎలాంటి ద్వేషాలూ, మనస్పర్థలు, కక్షలు ఉండవు. పెళ్ళికి కట్నం అవసరం ఉండదు, ఉద్యోగానికి లంచం అవసరం ఉండదు, చదువుకోడానికి డొనేషన్లు అవసరం ఉండదు.

సుక్ష్మంగా చెప్పాలంటే, మనిషి యొక్క మానసిక అభివృద్ధి పైనే అందమైన మనుగడ దాగి ఉంది. మనిషి మానసిక పరిపక్వత చెంది మనిషిలా జీవించిన నాడే డబ్బు ప్రాధాన్యత తగ్గి మానవతా విలువలకు, మనిషి యొక్క నిజమైన శ్రమకు గుర్తింపు లభిస్తుంది.

ప్రేరణ: ఇవాళ కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలతో కూడిన యు.పీ.ఏ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ఎదురుకోవలసి ఉండగా, దాని భాగంగా లోక్ సభ లో చర్చ జరుగుతుండగా, భాజపా నేతలు నోట్ల కట్టలను స్పీకర్ ముందు గుమ్మరించడం నన్ను ఈ వ్యాసం రాయడానికి ప్రేరేపించింది. డబ్బుకు ప్రజా స్వామ్యం అమ్ముడు పోయింది అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం.

- మహేష్

3 comments:

Amar said...

Well said.

Sireesha Chittajallu said...

Hi...It is really good..but you stopped posting further...

రామ said...

అవునండి. నిజం చెప్పారు. మీరు మళ్ళీ వ్రాయలేదు? మీ శైలి బాగుంది. వీలున్నప్పుడు వ్రాస్తూ ఉండండి.